We Believe JesusFé, Esperança e Nova Vida

యెహె 18

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యెహె 17 యెహె యెహె 19 →

1యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది.

2“తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి” అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్థం ఏంటి?

3నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో ఇంక మీరు పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

4“చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

5ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి,

6వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి,

7నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

8కాని ఆ నీతిమంతునికి, ఇలాంటివేవీ చెయ్యకుండా రక్తం ఒలికించే ఒక హింసాత్మకుడైన కొడుకు ఉంటే, వాడు బలాత్కారం చేస్తూ, ప్రాణహాని చేస్తూ, చెయ్యరాని పనులు చేసి,

9చెయ్యాల్సిన మంచి పనులు ఏవీ చెయ్యకుండా ఉంటే, అంటే, పర్వతాల మీద భోజనం చెయ్యడం, తన పొరుగువాడి భార్యను చెరచడం,

10అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,

11అప్పిచ్చి వడ్డీ తీసుకోవడం, అధిక లాభం తీసుకోవడం, మొదలైన పనులు చేస్తే, వాడు బ్రతకాలా? వాడు బ్రతకడు! ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు గనుక అతడు తప్పకుండా చస్తాడు. అతని ప్రాణానికి అతడే బాధ్యుడు.

12అయితే అతనికి ఒక కొడుకు పుట్టినప్పుడు, ఆ కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసి, తనమట్టుకు తాను దేవునికి భయపడి, అలాంటి పనులు చెయ్యకపోతే, అంటే,

13పర్వతాలమీద భోజనం చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరచకుండా,

14ఎవరినీ బాధ పెట్టకుండా, తాకట్టు వస్తువు ఉంచుకోకుండా, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యకుండా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

15పేదవాడి మీద అన్యాయంగా చెయ్యి వేయకుండా, లాభం కోసం అప్పివ్వకుండా, వడ్డీ తీసుకోకుండా, నా ఆదేశాలు పాటిస్తూ నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

16అతని తండ్రి క్రూరంగా ఇతరులను బాధపెట్టి, బలవంతంగా తన సహోదరులను దోపిడీ చేసి, తన ప్రజల్లో తగని పనులు చేశాడు గనుక తన పాపం కారణంగా తానే చస్తాడు.

17కాని మీరు “తండ్రి పాపశిక్ష కొడుకు ఎందుకు మొయ్యడు?” అంటారు. ఎందుకంటే, కొడుకు నీతిన్యాయాలకు అనుగుణంగా, నా శాసనాలనే అనుసరించి వాటి ప్రకారం చేస్తున్నాడు గనుక అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

18పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

19అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు.

20అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు.

21“దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

22“కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.

23కాని మీరు, ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి! మీ మార్గాలే గదా అన్యాయమైనవి.

24నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు వాటిని బట్టి చస్తాడు. తాను పాపం చేసిన కారణంగానే అతడు చస్తాడు.

25కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు.

26అతడు గమనించుకుని తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నీ చెయ్యకుండా మాని వేశాడు గనక అతడు చావకుండా కచ్చితంగా బ్రతుకుతాడు.

27కాని ఇశ్రాయేలీయులు ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అని అంటున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయం ఎందుకు కాదు? మీ మార్గం అన్యాయం ఎందుకు కాదు?

28కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.

29మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి?

30నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.”

← యెహె 17 యెహె యెహె 19 →