We Believe JesusFé, Esperança e Nova Vida

సంఖ్యా 25

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← సంఖ్యా 24 సంఖ్యా సంఖ్యా 26 →

1ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు.

2ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.

3ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.

4అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట, 25:4 యెహోవా ఎదుట, అందరూ చూసేలా.పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది” అని చెప్పాడు.

5కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో “మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి” అన్నాడు.

6అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు.

7యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి,

8సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.

9ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.

10అప్పుడు యెహోవా మోషేతో “యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు,

11వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.

12కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను.

13అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు” అన్నాడు.

14ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు.

15ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.

16ఇంకా యెహోవా మోషేతో “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.

17వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు.

18పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.”

← సంఖ్యా 24 సంఖ్యా సంఖ్యా 26 →