1ఇతర జాతులనూ దేశాలనూ గూర్చి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్కు.
2ఐగుప్తును గూర్చిన మాట. యూఫ్రటీసు నది సమీపాన ఉన్న కర్కెమీషు దగ్గర ఉన్న ఐగుప్తు రాజు ఫరో నెకో సైన్యాలను గూర్చిన సంగతులు. యోషీయా కొడుకూ యూదా రాజు అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ సైన్యాలను ఓడించాడు.
3“డాలునూ కవచాన్నీ సిద్ధం చేసుకోండి. యుద్ధానికి ముందుకు కదలండి.
4గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి.
5ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి.
6వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు.
7నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి.
8ఐగుప్తు నైలు నదిలా పైకి లేస్తుంది. దాని నీళ్ళు నదుల్లా పైకీ కిందికీ విసిరినట్టుగా ప్రవహిస్తుంది.
9గుర్రాలూ, పైకి లేవండి. రథాలూ రోషం తెచ్చుకోండి. సైనికుల్లారా బయలుదేరండి.
10ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు.
11కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో.
12నీకు కలిగిన అవమానం గూర్చి జాతులన్నీ తెలుసుకున్నాయి. నువ్వు చేసే రోదన ధ్వని భూమి అంతటా వినిపిస్తుంది.
13బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తుపై దాడి చేసినప్పుడు ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా చెప్పిన మాట ఇది.
14ఐగుప్తులో తెలియజేయండి. అది మిగ్దోలులోనూ మెంఫిస్ లోనూ వినిపించాలి.
15ఏపిస్ అనే నీ దేవుడు ఎందుకు పారిపోయాడు? నీ ఎద్దు దేవుడు ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే యెహోవా అతణ్ణి కిందకు పడవేశాడు.
16తడబడే వాళ్ళ సంఖ్యను ఆయన అధికం చేస్తున్నాడు. ఒక్కో సైనికుడు మరొకడి మీద పడిపోతున్నాడు. వాళ్ళు “లేవండి, ఇంటికి వెళ్దాం.
17వాళ్ళు అక్కడ “ఐగుప్తు రాజైన ఫరో కేవలం ఒక ధ్వని మాత్రమే. అతడు అవకాశాలను చేజార్చుకునే వాడు” అని ప్రకటించారు.
18సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. “నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు.
19ఐగుప్తు ఆడపడుచులారా, మీరు చెరలోకి వెళ్ళడానికి సిద్ధపడండి.
20ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది.
21వాళ్ళ మధ్యలో అద్దెకు తెచ్చుకున్న సైనికులు కొవ్వు పట్టిన ఎద్దుల్లా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు.
22ఐగుప్తు పైకి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అది పాములా బుసలు కొడుతూ పాక్కుంటూ అవతలికి వెళ్ళిపోతుంది.
23ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “అవి ఎంత దట్టమైన అడవులైనా వాళ్ళు దాన్ని నరికి వేస్తారు.
24ఐగుప్తు కుమారిని అవమానపరుస్తారు. ఉత్తరం వైపున దేశాల వారికి ఆమెను అప్పగిస్తారు.”
25సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నో పట్టణంలో ఉన్న ఆమోను దేవుణ్ణి, ఫరోనూ, ఐగుప్తునూ, దాని దేవుళ్ళనూ, రాజులనూ, ఫరో రాజులనూ, ఇంకా వాళ్ళలో నమ్మకముంచే వాళ్ళనీ నేను శిక్షించ బోతున్నాను.
26వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళను అప్పగిస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకూ, అతని సేవకులకూ వాళ్ళని అప్పగిస్తున్నాను. ఆ తర్వాత ఐగుప్తు మళ్ళీ ఇంతకు ముందు లాగానే ప్రజలకు నివాస యోగ్యం అవుతుంది.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
27“కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు.
28నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”