We Believe JesusFé, Esperança e Nova Vida

యిర్మీయా 39

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యిర్మీయా 38 యిర్మీయా యిర్మీయా 40 →

1యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.

2సిద్కియా పరిపాలనలో 11 వ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున ప్రాకారాలను కూల్చి పట్టణాన్ని ఆక్రమించారు.

3అప్పుడు బబులోను రాజు అధికారులు నేర్గల్‌ షరేజరు, సమ్గర్ నెబో, ముఖ్య అధికారి శర్సెకీము లోపలికి వచ్చి సింహద్వారంలో కూర్చున్నారు. నేర్గల్‌ షరేజరు ఒక ఉన్నత అధికారి. మిగిలిన వాళ్ళు బబులోను రాజుకు చెందిన అధికారులు.

4యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు.

5అయితే కల్దీయుల సేన వాళ్ళను తరిమి, యెరికో దగ్గర ఉన్న మైదానాల్లో సిద్కియాను కలుసుకుని, అతన్ని పట్టుకుని, హమాతు దేశంలోని రిబ్లా పట్టణం దగ్గర ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.

6బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కొడుకులను అతని కళ్ళముందే చంపాడు. అతడు యూదా ప్రధానులందరినీ చంపాడు.

7తరువాత అతడు సిద్కియా కళ్ళు పెరికించి అతన్ని బబులోనుకు తీసుకెళ్ళడానికి ఇత్తడి సంకెళ్లతో బంధించాడు.

8కల్దీయులు రాజమందిరాన్ని, ప్రజల ఇళ్ళను, అగ్నితో తగలబెట్టి, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు పడగొట్టారు.

9అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను, పట్టణంలో మిగిలి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి కల్దీయులతో చేరిన వాళ్ళను, ఇంకా మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు.

10అయితే నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలోనే ఉండనిచ్చి, వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చాడు.

11యిర్మీయా గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు,

12“నువ్వు అతనికి హాని చెయ్యొద్దు. అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతడు నీతో ఏది చెప్పినా అది అతని కోసం చెయ్యి.”

13కాబట్టి రాజదేహసంరక్షకుల అధిపతి నెబూజరదాను, నపుంసకుల అధిపతి నేర్గల్‌ షరేజరు, ఉన్నత అధికారి నేర్గల్‌షరేజరు, ఇంకా బబులోను రాజు ప్రధానులందరూ మనుషులను పంపి,

14చెరసాల ప్రాంగణంలో నుంచి యిర్మీయాను తెప్పించి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాకు అతన్ని అప్పగించారు. అప్పుడు యిర్మీయా ప్రజల మధ్య నివాసం చేశాడు.

15యిర్మీయా చెరసాల ప్రాంగణంలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు అతనితో ఇలా చెప్పాడు,

16“నువ్వు వెళ్లి కూషీయుడైన ఎబెద్మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడు, మేలు చెయ్యడం కోసం కాకుండా కీడు చెయ్యడానికి నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాను. ఆ రోజున నీవు చూస్తూ ఉండగా ఆ మాటలు నెరవేరుతాయి.

17ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించడం జరగదు’ అని యెహోవా అంటున్నాడు,

18‘కచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు ఖడ్గంతో చనిపోవు. నువ్వు నన్ను నమ్మావు గనుక, నీ ప్రాణమే నీకు కొల్లసొమ్ము అవుతుంది.’ ఇదే యెహోవా వాక్కు.”

← యిర్మీయా 38 యిర్మీయా యిర్మీయా 40 →