1యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు.
2మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు.
3మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి.
4ఎవడూ న్యాయంగా దావా వేయడం లేదు. ఎవడూ నిజాయితీతో తన వాదన వినిపించడం లేదు.
5వాళ్ళు విషసర్పాల గుడ్లను పొదుగుతారు. సాలెగూడు నేస్తారు.
6వారి సాలెగూళ్ళు బట్టలు నేయడానికి పనికిరావు. వాళ్ళు నేసిన దానితో ఎవరూ కప్పుకోలేరు.
7వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి.
8శాంతి మార్గం వారికి తెలియదు. వారి నడతల్లో న్యాయం కనబడదు.
9కాబట్టి న్యాయం మాకు దూరంగా ఉంది. నీతి మమ్మల్ని అందుకోవడం లేదు.
10గోడకోసం గుడ్డివారిలాగా, కళ్ళులేని వారిలాగా తడవులాడుతున్నాం.
11మేము ఎలుగుబంట్లలాగా గుర్రుమంటున్నాం. గువ్వలలాగా మూలుగుతున్నాం.
12మా అక్రమాలన్నీ నీ ఎదుట ఉన్నాయి. మా పాపాలు మామీద సాక్ష్యం చెబుతున్నాయి.
13యెహోవాను తిరస్కరించి మన దేవుని నుంచి తొలగిపోయి తిరుగుబాటు చేశాం.
14న్యాయాన్ని వెనక్కి నెట్టేశాము. నీతి దూరంగా నిల్చుంది.
15విశ్వసనీయత ఎటో పోయింది. దుర్మార్గాన్ని విసర్జించేవాడు దోపిడీకి గురి అవుతున్నాడు.
16ప్రజలకోసం విన్నపం చేసేవాడెవడూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
17నీతిని కవచంగా ఆయన ధరించుకున్నాడు. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకున్నాడు.
18వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగా తిరిగి చేస్తాడు. ఆయన తన విరోధులను కోపంతో శిక్షిస్తాడు. తన శత్రువులపట్ల ప్రతీకారం తీర్చుకుంటాడు. ద్వీపవాసులను కూడా తగురీతిగా శిక్షిస్తాడు.
19పడమటి దిక్కున ఉన్నవాళ్ళు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవాళ్ళు ఆయన మహిమకు భయపడతారు. యెహోవా ఊపిరితో కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు.
20“విమోచకుడు సీయోను వస్తాడు. యాకోబు వంశంలో తిరుగుబాటు చేయడం మానిన వారి దగ్గరికి విమోచకుడు వస్తాడు.” ఇదే యెహోవా వాక్కు.
21“నేను వారితో చేసే నిబంధన ఇది. నీ మీద ఉన్న నా ఆత్మ, నేను నీ నోట ఉంచిన మాటలు, నీ నోటినుంచీ నీ పిల్లల నోటి నుంచీ ఇది మొదలుకుని ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా చెబుతున్నాడు.