1ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు.
2నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి.
3తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
4నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!
5అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు.
6పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి.
7న్యాయవంతులు నడిచే దారి సమంగా ఉంటుంది. న్యాయ వంతుడా, నువ్వు న్యాయవంతులు దారిని తిన్నగా చేస్తావు.
8న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము.
9రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను.
10దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు.
11యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు.
12యెహోవా, నువ్వు మాకు శాంతిని నెలకొల్పుతావు. నిజంగా మా కార్యాలన్నిటినీ నువ్వే మాకు సాధించిపెట్టావు.
13మా దేవుడివైన యెహోవా, నువ్వు కాకుండా ఇతర ప్రభువులు మాపై రాజ్యం చేశారు గానీ మేం నీ నామాన్ని మాత్రమే కీర్తిస్తాం.
14వాళ్ళు చనిపోయారు. వాళ్ళిక మళ్ళీ బతకరు. వాళ్ళు మరణమయ్యారు. వాళ్ళిక తిరిగి లేవరు.
15యెహోవా, నువ్వు జనాన్ని వృద్ధి చేశావు. నువ్వే గౌరవం పొందావు.
16యెహోవా, కష్టాల్లో ఉన్నప్పుడు వారు నీ వైపు చూశారు. నువ్వు వాళ్లకి శిక్ష విధించినప్పుడు కీడుకువ్యతిరేకంగా నీకు ప్రార్థనలు వల్లించారు.
17బిడ్డని కనే సమయం దగ్గర పడినప్పుడు గర్భవతి వేదనతో కేకలు పెట్టినట్టుగానే ప్రభూ, మేం కూడా నీ సన్నిధిలో వేదన పడ్డాం.
18మేం గర్భంతో ఉన్నాం. నొప్పులు కూడా అనుభవించాం. కానీ మా పరిస్టితి గాలికి జన్మనిచ్చినట్టు ఉంది. భూమికి రక్షణ తేలేక పోయాం.
19మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి!
20నా ప్రజలారా, వెళ్ళండి! మీ గదుల్లో ప్రవేశించండి. తలుపులు మూసుకోండి.
21ఎందుకంటే చూడండి! యెహోవా తన నివాసం నుండి రాబోతున్నాడు. భూమిపైన ప్రజలు చేసిన అపరాధాలకై వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు.